'శ్రీవెంకటేశ్వర చిన్మయ తిరుమల
తిరుపతి వైకుంఠదీప్తి దనరు
విశ్వవిద్యాలయ విదితమౌ పద్మాక్షి
ఆలవేలుమంగ దివ్యారామమున్ బీబి
స్నిగ్ధ బంగర్పూత శిఖర దేవాలయాల్
కపిల తీర్థపు శోభగ్రాలు పురము
ఏడు కొండలపైకి యెగబ్రాకు రహదారి
కిరువైపులను దివ్యతరుల నగరు
సర్వ హిందూభక్త సంపత్తు కానుకల్
ప్రోవులై విలసిల్లు పుణ్యనగరు
సంస్క•తాంధ్రంబుల సాహిత్య సంగీత
లాస్యముల్ విలసిల్లు లలితపురము
యాత్రికాళికి సత్రము లాశ్రయమిడు
మహిని వైకుంఠమౌ తిరుమల తిరుపతి
తెలుగు భూమాత హస్తసందీప్తరత్న
కటక ఝణఝణ స్తోత్ర వేంకటుని పురము.
- కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
తెలుగువారి ఇలవేల్పు అయిన శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. ఆ శ్రీనివాసుని దివ్యక్షేత్రాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకోని తెలుగు కుటుంబం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఆ స్వామివారి పాదాల సన్నిధిన వెలసిన పుణ్యక్షేత్రం తిరుపతి. ‘తిరుపతి-తిరుమల’ పుణ్యక్షేత్రాలమధ్య మనకు పెద్ద వ్యత్యాసం కనబడదు. తిరుమల వెళ్లామన్నా, తిరుపతి వెళ్లామన్నా మన దృష్టిలో ఒక్కటే. అయితే, తిరుమలలో శ్రీవారి ఆలయం సుప్రసిద్ధం కాగా, తిరుపతి చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు, సందర్శించుకోవలసిన దేవాలయాలు అనేకంగా ఉన్నాయి. శ్రీవారి సతీమణి, తెలుగు ప్రజలకు కన్నతల్లి పద్మావతిగా అలమేలు మంగ వెలసిన తిరుచానూరు గురించి కూడా తెలుసుకోవలసింది అశేషంగా ఉంది.
క్రీ.శ. 3వ శతాబ్దప్రాంతంలో ఈ ప్రదేశాన్ని ‘తొండమండలం’ అనేవారు. ఆ తరువాత ఈ ప్రాంతం నాగుల పరిపాలనలోకి వచ్చాక, దీన్ని ‘నాగమండలం’ అనికూడా వ్యవహరించేవారు. క్రీ.శ. 5వ శతాబ్దప్రాంతంలో తిరుమలకు దిగువ భాగాన ఉన్న ప్రాంతాన్ని, ఇప్పుడు కపిల తీర్థం ఉన్న ప్రాంతాన్ని ‘కొత్తూరు’ అనేవారని తెలుస్తోంది. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని శ్రీరామానుజాచార్యుల వారు స్థాపించాక, ఆయన ఆ ప్రాంతానికి ‘తిరుపతి’ అని నామకరణం చేసి, కొత్త నగరానికి పునాదులు వేయటంతో, క్రమంగా తిరుపతి పట్టణం తన విస్తీర్ణం పెంచుకుంటూ వచ్చి, చివరికి కొత్తూరును సైతం తనలో కలిపేసుకుంది. అయితే, శ్రీ రామానుజలవారు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులను మాత్రమే ‘రామానుజ పురం’ అని వ్యవహరించారన్న వాదమూ ఉంది. విజయనగర రాజుల పాలనాకాలంలో ఈ రామానుజ పురానికి ఈశాన్యదిశగా నగరం విస్తరించి, కొత్తగా ‘శ్రీనివాసపురం’ ఏర్పడిందనీ అంటారు. శ్రీవారు నివసించి ఉన్న గ్రామానికి ‘త్రిపతి’ అనే పేరు ఉండేదని మరొక అభిప్రాయం. ‘త్రిపతి’ అంటే ‘త్రిమూర్తులకు ప్రభువు’ లేదా ‘అధినేత’ అనే అర్థం ఉందన్నది తెలిసిందే. ఆ ‘త్రిపతి’ అనే పేరే వాడుకలో ‘తిరుపతి’ అయిందనుకోవచ్చు. తమిళంలో ‘తిరు’ అంటే ‘శ్రీ’ అంటే ‘లక్ష్మి’ అని మరొక అర్థం ఉంది. స్వామివారు ‘లక్ష్మీపతి’ కనుక ‘శ్రీపతి’, అదే ‘తిరుపతి’ అయిందని భావించవచ్చు. ఆ తరువాత, నగరం క్రమంగా విస్తరణ చెందుతూ, ఇప్పటి రూపం సంతరించుకుంది. ఫలితంగా, కొత్తూరుతోబాటు అప్పటి చిన్న గ్రామాలన్నీ పూర్తిగా కనుమరుగైపోయాయన్నది వాస్తవం. ఇక, తిరుమాండ్యం శాసనం, కపిలేశ్వరపుర శాసనాల ఆధారంగా ఈ ప్రాంతానికి తుండీరమండలం, తుండక విషయము, తుండైనాడు, తొండమనాడు అనే పేర్లుండేవనీ, ఆ తరువాత కాలంలో దీనిని ‘జయంగొండ’ లేదా ‘జయంగొండ చోళమండలము’ అనికూడా పిలిచేవారనీ తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగవలసిన ఆవశ్యకత ఉంది.
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం
తిరుపతిలో తప్పనిసరిగా దర్శించుకోవలసిన ప్రదేశాలలో ముందుగా చెప్పుకోవలసినది - శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. గోవిందరాజస్వామిని శ్రీ వేంకటేశ్వరునికి పెద్దన్నగా చెబుతారు.
మేఘాలను తాకే విధంగా ఉండే రాజగోపురంతో తిరుపతికి విశిష్టమైన ఠీవిని కలుగజేస్తున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని పూజ్యులు శ్రీ రామానుజాచార్యులు క్రీ.శ. 1130లో పవిత్రం చేసి, భక్తులకు అంకితం చేశారు. అంతకుమునుపు ఈ ఆలయంలో ప్రధాన పూజలు అందుకనే దైవంగా శ్రీ పార్థసారథి స్వామివారు ఉండేవారు. ఎత్తయిన ఈ ఆలయ రాజగోపురాన్ని మాట్లి (మట్లి) కుమార అనంత రాజా క్రీ.శ. 1624లో నిర్మించారు. కొందరు ఈ ఆలయగోపురం - 14 లేదా 15వ శతాబ్దంలో నిర్మితమయిందని అంటారు. దీనికి 11 కలశాలు ఉన్నాయి.
నిజానికి ఇది ఒక్క ఆలయం కాదు. పేరుకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయమే అయినా, అది అనేక ఆలయాల సమూహం. ఒకప్పుడు ఇది శ్రీకృష్ణుని ఆలయమనీ, కానీ కాలక్రమేణా జరిగిన కొన్ని దాడులవల్ల ఈ ఆలయంలోని శ్రీకృష్ణ విగ్రహం పూజకు పనికిరాకుండా పోయిందనీ అంటారు. బాగా పరిశీలించి చూసినవారికి గోవిందరాజ స్వామి విగ్రహం, రాజ గోపురానికి నేరుగా కాక, కొంచెం పక్కగా ఉన్నట్లు అర్థమవుతుంది. రాజ గోపురానికి ఎదురుగా ఉండే ఆలయ గర్భగృహంలో సైతం గోవిందరాజస్వామి విగ్రహం మధ్యలో ఉండక, కొంచెం కుడివైపుగానే ఉంటుంది. రాజగోపురానికి నేరుగా ఉండే గర్భాలయంలో శ్రీకృష్ణుని విగ్రహం ఉందనీ, దీనికి పూజార్హత లేని కారణంగా ఆ విభాగాన్ని పూర్తిగా మూసేసి ఉంచారనీ అంటారు. అంటే, ఇక్కడ గర్భగృహంలో రెండు భాగాలు ఉన్నాయన్నమాట! ఇక, క్రీ.శ. 1130లో శ్రీ రామానుజులవారి పూనికతో ఈ దేవాలయం - గోవిందరాజస్వామివారి పరమైనా, సుమారుగా క్రీ.శ. 1245 ప్రాంతంనాటికి ఈ ఆలయం పూర్తి రూపాన్ని సంతరించుకుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామి తన తలను ఒక కుంచంలాంటి కొలిచే పాత్రమీద పెట్టి విశ్రమిస్తున్న తీరులో కానవస్తారు. పద్మావతితో తన కల్యాణ సమయంలో కుబేరునివద్ద తాను తీసుకున్న ఋణాన్ని, దానిపై వడ్డీని శ్రీ వేంకటేశ్వరుడు అప్పటినుంచీ ఇప్పటివరకూ తీర్చేపనిలోనే ఉన్నాడని అంటారు. ఇలా ఆ ఋణమొత్తాన్ని, దానిపై వడ్డీని తీర్చేందుకు శ్రీ వేంకటేశ్వరుని ఆలయ హుండీలో, ఇతరత్రా లభించే మొత్తాలను ఆ కుంచం పాత్రతో కొలిచి, కొలిచి గోవిందరాజస్వామి అలసిపోయినందువల్లే కొంత విశ్రాంతి తీసుకుంటూ అలా శయనించిన రీతిలో ఉంటారని అంటారు. గర్భగృహంలో వేదాంత దేశికులవారి శిలావిగ్రహం ఉంది.
గోవిందరాజస్వామివారి ఆలయ సముదాయప్రాంగణంలో మనకు పలు ఉపాలయాలు కానవస్తాయి. వాటిని వరుసగా పేర్కోవాలంటే -
- శ్రీ పార్థసారథి, శ్రీ కల్యాణ వేంకటేశ్వర, శ్రీ ఆండాళ్ (గోదాదేవి, లేదా చూడికుడుత్తమ్మ నాచ్చియార్, లేదా ఆముక్తమాల్యద), శ్రీ సాలై నాచ్చియార్, శ్రీ భాష్యకార్ల వారి ఆలయం, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఆలయం, శ్రీ కురుత ఆళ్వార్, శ్రీ మధురకవి ఆనంద ఆళ్వార్ ఆలయం, శ్రీ చక్రట్టాళ్వార్ ఆలయం, శ్రీ ముదల్ ఆళ్వార్ ఆలయం, శ్రీ మనవాళ మహాముని ఆలయం, శ్రీ వేదాంత దేశికర్ ఆలయం, శ్రీ నమ్మళ్వార్ ఆలయం, శ్రీ సంజీవరాయ స్వామి (మట్టం ఆంజనేయస్వామి) ఆలయం, శ్రీ తిరుమల నంబి సన్నిధి ఉన్నాయి. గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లే దారి మొదట్లో ధ్వజస్థంభం ఎదురుగా ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. సుప్రసిద్ధమయిన ఈ ఆలయాల సందర్శనకు మనం తగినంత సమయం కేటాయించుకోవటం మంచిది.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పలు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలలో వైశాఖ ఉత్సవం అనే వార్షిక బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం, అధ్యయనోత్సవం, తిరువడిపురం, గోదా పరిణయం, శ్రీ సాలై నాచ్చియార్ పంగుని ఉత్తిరమ్ ఉత్సవం, రథసప్తమి, జ్యేష్ఠాభిషేకం, అణివార ఆస్థానం, నీరటోత్సవం, బుగ్గోత్సవం, పవిత్రోత్సవం, 2014నుంచి ఆరంభం అయిన పుష్పయాగం వంటివి ముఖ్యమైనవి. వీటికి అదనంగా, పార్వేట ఉత్సవం, పొన్నకాల్వ ఉత్సవం, ప్రతీ పౌర్ణమినాడు జరిగే పౌర్ణమి గరుడసేవ, తిరునక్షత్రంలో పన్నెండు ఆళ్వార్ల ఆలయాలలో ప్రతీ దానిలోనూ పదేసి రోజులపాటు జరిగే ఆళ్వార్ సాత్తుమొరై వంటివీ ఉన్నాయి.
తిరుపతిలో శేషాచలానికి దిగువ భాగాన ఉన్న కపిలతీర్థాన్నీ, అక్కడే ఉన్న ‘శ్రీ కపిలేశ్వర స్వామి’వారి ఆలయాన్ని తప్పనిసరిగా చూసిరావాలి. ముఖ్యంగా వర్షాకాలంలో నిండుగా ప్రవహించే కపిల తీర్థం అందం చెప్పనలవి కాదు. పైనుంచి నీరు జలపాతధారలుగా దిగువకు ప్రవహిస్తోంటే, ఆ వెనుకవైపున్న కొండలలోపల వెలసిన ఆలయంలో కొలువై, భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరిస్తున్న రీతిలో త్రినేత్రుడు దర్శనం ఇస్తుంటాడు. వైష్ణవక్షేత్రమయిన తిరుపతిలో ఉన్న ఏకైక ప్రాచీన ఈశ్వరాలయం ఇదే! ఈ ఆలయంలో స్వామివారిని కపిల మహాముని ప్రతిష్టించినందువల్లే ఇక్కడి స్వామివారిని ‘శ్రీ కపిలేశ్వర స్వామి’గా పేర్కొంటారు. కపిల తీర్థాన్నే ‘ఆళ్వార్ తీర్థం’ అనీ, ‘చక్రతీర్థం’ అనీ అంటారు. కపిలేశ్వర స్వామి ఆలయానికి దక్షిణంవైపు కామాక్షి ఆలయం కూడా ఉంది. ఇక్కడ మనం వల్లీ దేవసేనలతో కూడిన కుమారస్వామి, గణపతి, దేవి, కుమార, దక్షిణామూర్తి, ఆలింగన చంద్రశేఖర మూర్తి, సూర్య విగ్రహాలను సైతం దర్శించుకోవచ్చు. ఈ కపిలతీర్థం, తిరుపతి పట్టణంలో భాగంగానే, అలిపిరికి వెళ్లే దారిలో ఉంది.
తిరుపతిలోనే అలిపిరికి వెళ్లే మార్గంలోనే ‘రాములవారి సన్నిధి వీధి’లో ఉంది మరో ముఖ్య ఆలయం - అదే, శ్రీ కోదండరామాలయం. ఈ ఆలయంలో శ్రీ కోదండరామస్వామి,సీతాదేవి, లక్ష్మణుల మూలవిగ్రహాలతోబాటు, వీరందరి ఉత్సవమూర్తులు, ఆంజనేయుని ఉత్సవ విగ్రహంకూడా ఉన్నాయి. గర్భగృహంలో శ్రీకృష్ణుని విగ్రహంకూడా ఉంది. ఈ ఆలయంలోని వంటశాలలో వకుళాదేవి విగ్రహమూ ఉంది. ఇక, ఈ ఆలయంలో ఊంజల్ మండపం, రెండు ఆస్థాన మండపాలు, పురాణపఠన మండపం, ముఖమండపం, రామవాహనమండపం, రథోత్సవ మండపాలు ఉన్నాయి. సాధారణంగా సీతమ్మతల్లి శ్రీరాములవారికి వామభాగాన (ఎడమవైపున) ఉండటం సంప్రదాయం. (సుప్రసిద్ధ భద్రాచల క్షేత్రంలోనూ సీతమ్మతల్లి శ్రీరాములవారి ఎడమవైపునే, ఆయన తొడమీద కూర్చుని ఉన్నట్లు కానవస్తుంది.) కానీ, ఈ ఆలయంలో మాత్రం, వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం, శ్రీరాములవారికి కుడివైపున సీతమ్మవారు ఉండటం ప్రత్యేకత. ఇలా అమ్మవారు స్వామికి కుడివైపున ఉంటే, భక్తులకు మోక్షప్రాప్తి కలుగుతుందంటారు. ఈ కోదండరామాలయానికి ఎదురుగానే భక్తాంజనేయస్వామి ఆలయంకూడా ఉంది.
తిరుపతిలో తప్పక దర్శించవలసిన ఆలయాలలో ఒకటి - శ్రీ తాళ్లపాక గంగమ్మవారి ఆలయం. తిరుపతిలో ‘తాతాయగుంట గంగమ్మ ఆలయం’ అనీ, ‘అంకాళమ్మ’ అనీ మరికొన్ని దేవాలయాలూ ఉన్నాయి. అయితే, ‘తాళ్లపాక గంగమ్మవారి ఆలయం’ తిరుపతిలో వెలియటానికి ఒక కథను చెప్తారు. (ఈ కథ - తాళ్లపాక తిరువెంగళనాథుడు రాసిన ‘అన్నమాచార్య చరిత్ర’ పుస్తకానికి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు రాసిన ‘పీఠిక’లో 11వ పేజీలో పాదపీఠికగా ఉంది.)
ఒకానొక కాలంలో తిరుపతినుంచి తిరుమల తాతాచార్యులవారు శిష్యసంచారము చేస్తూ, కడప ప్రాంతములోని ఒక ఊరికి చేరారు. ఆ గ్రామదేవత - గంగానమ్మ, ప్రతీ సంవత్సరమూ భయంకరవ్యాధుల రూపంలో ఊరిని ఆవహించి అసంఖ్యాక జనాలను ఆహుతి కానిచ్చేది. ఒక జాతర సమయంలో ఆ దేవత కరుణించి ‘ఏడాదికి ఒక్క నరబలి ఇచ్చినచో చాలున’ని గ్రామప్రజలకు తెలియజేసింది. దానితో - ఆ జాతరల సమయంలో తమ గ్రామానికి వచ్చిన ఒక బాటసారిని బలిఇచ్చేవారు. ఈసారి తాతాచార్యులవారు చిక్కారు. కానీ, గురువుగారిని బలి ఇవ్వటమా అనే సందేహం వారిలో ఏర్పడింది. ఈ విషయం తెలిసిన తాతాచార్యులవారు ‘నాకేమీ కాదు, వెళ్లనీయండి’ అని ముందుకు ప్రయాణం సాగించారు. జాతర జరుగుచోట వారు - అష్టాక్షరీ నారాయణ కవచాదులను అనుసంధానం చేసుకుంటూ, కణకణ నిప్పురవ్వలను రగిలించి, శంఖచక్రముద్రలను ఎర్రగా కాల్పించి, తగినవిధంగా సిద్ధంగా ఉంచుకున్నారు. జాతరలో అమ్మవారి పూనకము పొందిన ఒక భక్తుడు - ‘శివశక్తి’గా మారి బలి కోరుతూ తాతాచార్యులవారి మీదకు దూకాడు. ఆచార్యులవారు వెంటనే పట్టకారులతో శంఖచక్రముద్రలను ఆ శివశక్తిగా ఉన్న పూనకముపొందినవాని రెండు భుజాలమీదనూ ‘చక్రాకింతాలు’ వేయటానికి ఉద్యుక్తులయ్యారు. దానితో ఆ శివశక్తి వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ, మంత్రశక్తితో అతని అడుగులు పడలేదు. దానితో తాతాచార్యులవారి ముద్రలు ‘భుజం తప్పినా వీపు తప్పలేదు’ అన్న సామెతకు తావునిస్తూ, ఆ శివశక్తి వీపుపై పడ్డాయి. ఈ దెబ్బకు గంగానమ్మ దిగివచ్చి తాతాచార్యులవారి శిష్యరికం కోరింది. వారు - ఆమెకు తన శిష్యరికం అనుగ్రహించి, తిరుపతికి తీసుకు వచ్చి, ఊరివెలుపల నెలకొల్పారని ఇతిహ్యం. ఫలితంగా, ఆ కడపప్రాంతవాసులకు ఆ బెడద తప్పింది. తిరుపతికి గంగానమ్మ చేరింది. తాతాచార్యులవారు ఆమెకు జంతుబలిని, మద్యపు జూరలనూ అనుగ్రహించినా, ఆమె శుద్ధసాత్త్వికురాలై, జంతుబలిని, మద్యాన్ని పరిత్యజించి, గ్రామప్రజలపై దయను చూపుతోంది.
ఈ ఆలయాన్ని తిరుపతికి వచ్చే యాత్రికులు ముందుగా దర్శించి, ఆమెను అర్చించి, క్షేతప్రవేశం చేయాలనే నియమం ఉండేది. ఈ నియమం ప్రకారమే అన్నమయ్య కూడా తన తిరుపతి క్షేతప్రవేశ సమయంలో ఈ అమ్మవారిని దర్శించారని ప్రశస్తి. అందుకే, ఈమెకు ‘తాళ్లపాక గంగమ్మ’ అనే పేరు స్థిరపడిందని అంటారు.